: అయామ్ ది బెస్ట్ మార్కెటింగ్ మేనేజర్: చంద్రబాబు

వచ్చే 13 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ ను సరఫరా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ ఉదయం లిక్విడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటు దిశగా ఏపీ జీడీసీ (గ్యాస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్), గెయిల్, ఇంజి సంస్థల మధ్య డీల్ కుదిరిన సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకూ గ్యాస్ పైప్ లైన్ నిర్మిస్తామని, ఏపీలోని ప్రజలందరూ పైపుల ద్వారా వంట గ్యాస్ అందుకోవాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు బెస్ట్ మార్కెటింగ్ మేనేజర్ గా ఉంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒప్పందంలో భాగంగా కాకినాడ డీప్ వాటర్ పోర్టు వద్ద సముద్రంలో తేలియాడే టెర్మినల్ ను రూ. 1,800 కోట్ల వ్యయంతో చేపట్టనున్నామని, రోజుకు 15 మిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ ను ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తామని వివరించారు. దేశంలోని తూర్పు తీరంలో ఇదే తొలి తేలియాడే టెర్మినల్ అని పేర్కొన్న బాబు, గెయిల్, ఏపీజీడీసీలు దీన్ని సంయుక్తంగా నిర్మిస్తాయని వెల్లడించారు. ఈ టెర్మినల్ లో ఏపీ ప్రభుత్వం, గెయిల్ భాగస్వామ్యంలోని ఏపీజీడీసీలకు 48 శాతం వాటా ఉంటుందని, షెల్, ఇంజి, గెయిల్ లకు 52 శాతం వాటా ఉంటుందని వివరించారు. దీని నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని బాబు తెలిపారు. 19వ శతాబ్దం బొగ్గు నిల్వలకు, 20వ శతాబ్దం చమురు నిల్వల అభివృద్ధికి నిదర్శనాలుగా నిలిస్తే, 21వ శతాబ్దం సహజవాయువుదేనని ఆయన అభివర్ణించారు.

More Telugu News