: 47 మంది టాప్ అమెరికన్ సీఈఓలకు మోదీ ఇస్తున్న విందులోని నోరూరించే వంటకాలివి!

అమెరికాలోని 47 ప్రముఖ కంపెనీల చీఫ్ లతో సమావేశమై ఇండియాకు పెట్టుబడులను ఆహ్వానించాలని భావిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, వారికి గుర్తుండిపోయే విందును అందించాలని భావిస్తున్నారు. ఇండియాలోని పండగలను గుర్తుకు తెచ్చేలా దక్షిణాది, ఉత్తరాది వంటకాలతో కూడిన మెనూను ఆయన స్వయంగా సిద్ధం చేయగా, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా దగ్గరుండి వీటిని తయారు చేయించనున్నారు. న్యూయార్క్ లోని వాల్డార్ఫ్ హోటల్ లో ఈ సమావేశం జరగనుండగా, కర్ణాటక తోటల నుంచి తెప్పించిన మేలు రకం గంధం, కాశ్మీర్ కుంకుమ పువ్వుల మేళవింపుతో తయారు చేసిన షర్బత్, పొమిగ్రనేట్ (దానిమ్మ) శాంగ్రియా కాక్ టైల్, తండూరీ పైనాపిల్, పనీర్ రవియోలీ, తాండై చికెన్, మిజోరాం బ్లాక్ రైస్ కిచడీ, షీర్ మాల్, మామిడి-అల్లం సూప్, కొబ్బరి అన్నం మెనూలో చోటు సంపాదించుకున్నాయి. వీటితో పాటు ఇడ్లీ, దోశ, ఊతప్పం వంటి పలు రకాల అల్పాహార వంటకాలు, వివిధ వెరైటీల స్వీట్స్ తో సీఈఓలకు విందు ఇవ్వాలని మోదీ నిర్ణయించారు. కానీ, వాస్తవానికి మోదీ అసలు మెనూ ఇది కాదు. వీరిని తన వాక్చాతుర్యం, విందుతో ఆకట్టుకుని ఇండియాకు వ్యాపారాన్ని, పెట్టుబడులను తరలించాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. మోదీ కలవనున్న కంపెనీల చీఫ్ ల సంయుక్త ఆస్తి 4.5 ట్రిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 292 లక్షల కోట్లు. ఇది ఇండియా స్థూల జాతీయోత్పత్తి కన్నా రెండు రెట్లు అధికం. ఫోర్డ్, లాక్ హీడ్ మార్టిన్, సిటీ గ్రూప్, డూపాంట్, గోల్డ్ మెన్ సాక్స్, బ్లాక్ స్టోన్, బోయింగ్, కార్గిల్, స్టార్ వుడ్, పేపాల్, ఐబీఎం తదితర కంపెనీల సీఈఓలు మోదీతో సమావేశం కానున్నారు.

More Telugu News