: బాలయ్య నోట ‘సస్యశ్యామలం’ మాట... ‘అనంత’ వలసలను నివారిస్తామని ప్రకటన
నిన్నటిదాకా సినిమా డైలాగులతో అభిమానులను అలరించిన టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ తాజాగా అభివృద్ధి మంత్రం పఠిస్తూ ఏపీ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన తరచూ తనను గెలిపించిన ప్రజలతో మమేకమవుతున్నారు. నెలకు కనీసం రెండు సార్లైనా ఆయన హిందూపురంలో పర్యటిస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా బాలయ్య అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిన్న తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన ఆయన అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. హంద్రీ నీవా ప్రాజక్టు జలాలతో అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని బాలయ్య ప్రకటించారు. అంతేకాక జిల్లాలో పరిశ్రమలను స్థాపించడం ద్వారా వలసలకు చెక్ పెడతామని కూడా ఆయన పేర్కొన్నారు.