: అక్టోబర్ 10 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... 29న రైతు ఆత్మహత్యలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 10 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు నిర్వహిస్తారు. అవసరమైతే సభను పొడిగించేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించగా... ఇందుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. సమావేశాల్లో భాగంగా ఈ నెల 29న రైతుల అత్మహత్యలు, వ్యవసాయ సమస్యలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా రైతు ఆత్మహత్యలపై చర్చ చేపట్టనున్నారు. ప్రశ్నోత్తరాల తరువాతే వాయిదా తీర్మానాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో సభలో సీట్ల కేటాయింపుపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తావించారు. తనకు తప్ప మిగతా వారికి వెనక సీట్లు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.