: కల్తీ కల్లు మాయ... కిక్కు దొరక్క ప్రాణం హరీ!

తెలంగాణ జిల్లాల్లో కల్లు తాగుతుంటే, గతంలో ఉన్న కిక్కు రావట్లేదంటూ, పలువురు మృత్యువాత పడుతున్నారు. కల్తీ కల్లుకు బానిసలై, నిఖార్సయిన కల్లు తాగలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఇప్పటివరకూ 'కిక్కిచ్చే కల్లు' దొరకక 15 మంది మృతి చెందారు. ఒక్క పాలమూరు జిల్లాలోనే 11 మంది మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లాలో నలుగురు మరణించారు. మానసిక స్థిరత్వాన్ని కోల్పోయి, వింతగా ప్రవరిస్తూ, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవలి వరకూ తెలంగాణ రాష్ట్రంలో మందు కల్లు విక్రయాల జోరుగా సాగుతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక్కసారిగా కల్తీకల్లుపై ఉక్కుపాదం మోపడంతోనే ఇలా జరుగుతోందని, రాష్ట్రంలోని చెట్ల నుంచి లభిస్తున్న కల్లుకు, విక్రయాలు కొనసాగిస్తున్న కల్లుకు ఏమాత్రం పొంతనలేదని మానసిక వైద్యులు వ్యాఖ్యానించారు. కల్తీ కల్లు సేవించడానికి అలవాటు పడ్డ వ్యక్తులు ఇక ఏ మత్తుపానియం సేవించినా కిక్కు ఎక్కదని పేర్కొంటున్నారు. కల్తీ కల్లులో క్లోరోఫాం, డైజోఫాం, అల్ఫోజోమ్, హైడ్రేడ్, యూరియా, కుంకుడు కాయలు, శాకరీన్ వంటి పదార్థాలను కలుపుతారు. దీంతో ఆ కల్లును తాగగానే మత్తు వస్తుంది. 180ఎమ్ఎల్ మద్యం సేవిస్తే వచ్చే కిక్కు కేవలం రెండు, మూడు గ్లాసుల కల్తీ కల్లుతో లభిస్తుంది. దీనిని బట్టే కల్లులో ఎంత గాఢమైన రసాయనాలు కలుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి కల్తీ కల్లు సేవించిన వారు ఇక అ అలవాటును మానుకోలేరు. వీరికి తరచూ గొంతు ఎండిపోతూ ఉంటుంది. దాహం వేసినా నీరు తాగేందుకు ఇష్టపడరు. మళ్లీ అదే కల్లు సేవిస్తేగాని వీరికి ఉపశమనం కలగదు. రోజు కల్తీ కల్లు తాగకపోతే ఉన్మాదిలా మారిపోతారు. కొన్ని సందర్బాలలో పూర్తిగా పిచ్చివారిలా వ్యవహరిస్తారు. ప్రాణాలు సైతం తీసుకునేందుకు సిద్ధపడతారు. కల్తీకల్లును పూర్తి స్థాయిలో నిరోధించాలంటే దశల వారీగా చర్యలు తీసుకోవాల్సిందే తప్ప, ఇలా ఒక్కసారిగా ఆపేస్తే విపరీత పరిణామాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News