: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపణలు నిజమేనట...నగరి మునిసిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్ సస్పెండయ్యారు. నిధుల దుర్వినియోగం, పింఛన్ల పంపిణీలో అవకతవకలకు పాల్పడ్డ కారణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏపీ పురపాలక శాఖ డైరెక్టర్ పేరిట నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నగరి నుంచే వైసీపీ మహిళా నేత, సినీ నటి రోజా ఎమ్మెల్యేగా ఎంపికైన సంగతి తెలిసిందే. మునిసిపల్ కమిషనర్ గా బాలాజీనాథ్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎమ్మెల్యే రోజా, మునిసిపల్ చైర్ పర్సన్, వైసీపీ నేత కేజే శాంతిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని వారు పలుమార్లు ఆందోళనలకు దిగారు. ఒకానొక సందర్భంగా కేజే శాంతి కుమారుడు కమిషనర్ పై దాడి చేశారని వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కేజే శాంతి కుమారుడితో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నగరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కమిషనర్ అవినీతి వ్యవహారం, ఇష్టారాజ్య పాలనపై రోజా మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు రోజా ఆరోపణల్లో నిజముందని తేల్చారట. తనపై విచారణ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న బాలాజీనాథ్ యాదవ్ వారం రోజులుగా అడ్రెస్ లేకుండాపోయారు. కనీసం సెలవు పెట్టకుండా, తన బాధ్యతలు ఇంకొకరికి అప్పగించకుండా, తన గదికి తాళం వేసుకుని మరీ ఆయన వెళ్లిపోయారు. దీనిపై కేజే శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ అడ్రెస్ లేకుండాపోయిన వైనంపై నగరిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే, నిన్న రాత్రి ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. నగరి మునిసిపాలిటీ బాధ్యతలను పుత్తూరు కమిషనర్ శ్రీహరిబాబుకు అదనంగా అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

More Telugu News