: పాక్, చైనాలు స్వయంగా తయారు చేస్తుంటే, మనం మాత్రం ఇజ్రాయిల్ వెంట!
శత్రువుల స్థావరాల పైకి దూసుకెళ్లి బాంబులు కురిపించగల మానవరహిత యుద్ధ విమానాలను పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనాలు స్వయంగా తయారు చేసుకుంటుంటే, భారత్ మాత్రం ఇజ్రాయిల్ వెంట పడుతోంది. ఇజ్రాయిల్ నుంచి డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్లు చేతికందితే, ప్రాణనష్టం జరగకుండా శత్రువులపై దాడులు చేసేందుకు వీలవుతుందని వివరించాయి. కొద్దికాలం క్రితం తాలిబాన్ మిలిటెంట్లపై దాడుల సమయంలో పాకిస్థాన్ దేశవాళీ డ్రోన్లను వాడిందని వార్తలు వచ్చిన తరువాత, సాధ్యమైనంత త్వరలో డ్రోన్లను తన అమ్ముల పొదిలో కలుపుకోవాలని ఇండియా భావిస్తోంది. పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉండటం, డ్రోన్లు చేరడం, మరోవైపు పాక్ కు మిత్రదేశంగా మారిన చైనా వద్ద ఈ తరహా శాస్త్ర సాంకేతికత, ఇండియాతో పోలిస్తే మరింత ముందుకు సాగడంతో, కొంత ఆందోళనలో ఉన్న రక్షణ వర్గాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. కాగా, ఇప్పటికే ఇజ్రాయిల్ నుంచి యూఏవీ (అన్ మాన్డ్ ఏరియల్ వెహికిల్)లను కొనుగోలు చేసిన ఇండియా వాటిని కాశ్మీరు లోయలో నిఘా నిమిత్తం వాడుతోంది. కాగా, ఇండియా స్వయంగా భారీ డ్రోన్లను తయారు చేసేందుకు మరింత సమయం పట్టవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు.