: టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టం... మావోయిస్టు నేత దామోదర్ హెచ్చరిక లేఖ
వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయిన ఘటనకు ప్రతిగా కేకేడబ్లూ కార్యదర్శి దామోదర్ టీఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తూ లేఖ పంపారు. ఆ లేఖను మీడియాకు పంపిన దామోదర్, టీఆర్ఎస్ నేతలను వదిలేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అన్నారు. మంచినీళ్ల కోసం దళాన్ని వదిలి వెళ్లిన శృతి అలియాస్ మహిత, విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ లను పోలీసులు పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపించారు.
ఎదురుకాల్పులు జరిగినట్టు చెప్పడం బూటకమన్నారు. వారి మరణానికి కారకులైన వారికి ప్రజల చేతిలో శిక్ష తప్పదన్నారు. అధికారంలోకి వస్తే మావోల ఎజెండా అమలు చేస్తానన్న కేసీఆర్... మావోయిస్టుల నిర్మూలనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నాడని దామోదర్ తీవ్రంగా విమర్శించారు. టీఆర్ఎస్ జిల్లా నేతలు, మంత్రులను ఎట్టి పరిస్థితుల్లోను వదలిపెట్టమన్నారు.