: హార్దిక్ బాటలో అమెరికన్ ‘పటేళ్లు’... మోదీకి నిరసన తెలిపేందుకు భారీ సన్నాహాలు
గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ బాటలోనే అమెరికాలో స్థిరపడ్డ పటేల్ సామాజిక వర్గం పయనించేందుకు సిద్ధమవుతోంది. ఓబీసీ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన తమ సామాజిక వర్గంపై ఆగస్టు 25న అహ్మదాబాదులో గుజరాత్ పోలీసులు జరిపిన లాఠీచార్జీకి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు నిరసనలతో స్వాగతం పలికేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం మోదీ అమెరికా వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సిలికాన్ వ్యాలీలోనూ పర్యటించనున్నారు.
సిలికాన్ వ్యాలీలో మోదీకి నిరసన తెలిపేందుకు అక్కడి పటేల్ సామాజిక వర్గం భారీ సన్నాహాలు చేస్తోంది. ఏకంగా 20 వేల మందితో భారీ నిరసన తెలిపేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఫిలడెల్పియాలో స్థిరపడ్డ తేజాస్ భకియా చెప్పారు. ఇక న్యూయార్క్ లోనూ 10 వేల మందితో మోదీకి నిరసన తెలుపుతామని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ పటేల్ సామాజిక వర్గానికి చెందిన తేజాస్ కొంతకాలం క్రితం అమెరికా వెళ్లి అక్కడే వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. మోదీకి నిరసన తెలిపేందుకు ఆయన తన సామాజికవర్గానికి చెందిన వారిని సమీకరించే పనిలో బిజీబిజీగా ఉన్నారు.