: గ్రేటర్ లో 503 మద్యం దుకాణాలకు దరఖాస్తులు 100 మాత్రమే!

మందు కొట్టి బైకు నడిపితే, పోలీసుల నుంచి కేసులు, ఏటేటా పెరుగుతున్న ధరలు... మందు బాబులు మద్యం సేవించే ముందు మరోసారి ఆలోచించేలా చేస్తుంటే, పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు, వీధికో కల్లు దుకాణం, కోట్లకు చేరిన లైసెన్స్ ఫీజులు, రూ. అర లక్షకు పెరిగిన దరఖాస్తు ఫీజు తదితరాలు వ్యాపారులను మద్యం వ్యాపారమే వద్దురా బాబూ అనుకునేలా చేస్తున్నాయి. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 503 దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే, కనీసం 100 దరఖాస్తులు కూడా రాలేదు. అమీర్ పేట వంటి అత్యంత బిజీ ప్రాంతంలో రెండు షాపులుండగా, ఒక్క షాపుకు, ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చిందంటే, వ్యాపారులు ఎంత 'ఆసక్తి'గా ఉన్నారో అర్థమవుతుంది. గోల్కొండ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం షాపునకు రెండేళ్లకు గాను రూ. 2.16 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలి. నిర్ణీత పరిమితికి మించి అమ్మకాలు జరిపితే, ప్రివిలేజ్ ఫీజు పేరిట భారీగా చెల్లించుకోవాలి. దీంతో గతంలో ఉన్న పోటీ ఇప్పుడు కనిపించడం లేదు. కాగా, దరఖాస్తులకు తుది గడువు 21వ తేదీతో ముగియనుండగా, ఎవరూ దరఖాస్తు చేయని దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని యోచిస్తోంది.

More Telugu News