: ఒంగోలులో పొగాకు కొనుగోళ్లను పరిశీలించిన నిర్మలా సీతారామన్... మంత్రి కారును అడ్డుకున్న రైతులు
ఏపీలో పొగాకు రైతులను పరామర్శించే అంశంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఒకటో వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించారు. మంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, తదితరులు పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు. ధరలపై కేంద్ర మంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలంపై పలువురు రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. తరువాత మంత్రి పొందూరులో పర్యటించగా... పొగాకు కొనుగోళ్లపై నిర్దిష్ట హామీ ఇవ్వకుండా వెళిపోతున్నారంటూ కారును అడ్డుకున్నారు. మిగిలిన పొగాకు కొనుగోలుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
అంతకుముందు పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలంటూ ఒంగోలు ఎంపీ, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. నష్టపోయిన రైతులకు భారీ స్థాయిలో నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కాగా, రాష్ట్రంలో పొగాకు సంక్షోభం ఉంటే పొగాకు బోర్డు ఛైర్మన్ ఇటలీ వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఆయనను విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.