: రాజస్థాన్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు... షాక్ తిన్న ఏసీబీ అధికారులు
మూతపడ్డ గనులను తిరిగి తెరిచేందుకు మైనింగ్ శాఖ అధికారులు భారీ ఎత్తున లంచం తీసుకున్నారన్న సమాచారంతో రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు నిన్న పలు చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో భాగంగా ఓ ప్రాంతంలో సోదాలకు వెళ్లిన ఏసీబీ అధికారులకు కళ్లు తిరిగినంత పనైంది. ఎందుకంటే, ఆ ఇంటిలో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయట. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా రూ.3.80 కోట్ల మేర నగదు అక్కడ నోట్ల కట్టల రూపంలో బయట పడింది. వీటిని లెక్కపెట్టేందుకు మిషన్లతో వచ్చినా, ఏసీబీ అధికారులకు మూడు గంటల సమయం పట్టిందట.
వివరాల్లోకెళితే, రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ కు చెందిన మైనింగ్ వ్యాపారి షేర్ ఖాన్ అనే వ్యక్తికి చెందిన ఆరు గనులను అక్రమ తవ్వకాల పేరిట ఇటీవల అధికారులు మూసేశారు. వాటిని తెరిపించుకునేందుకు షేర్ ఖాన్ దొడ్డిదారిని ఆశ్రయించారు. మూసేసిన గనులను తెరుస్తాం కానీ, మాకేంటి? అంటూ ఆ రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులు అశోక్ సింఘ్వీ, ఆయన కింద పనిచేసే ముగ్గురు జూనియర్లు, ఆ శాఖ అదనపు డైరెక్టర్ పంకజ్ గెహ్లాట్ బేరం పెట్టారట.
లంచమిచ్చేందుకు షేర్ ఖాన్ కూడా సరేననడమే కాక ఓ చార్టెర్డ్ అకౌంటెంట్ ద్వారా వారు అడిగిన మేర మొత్తాన్ని చెల్లించాడట. దీనిపై విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులందరి ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా మిగతా అధికారుల విషయం అలా పక్కనబెడితే, ఒక్క సింఘ్వీ ఇంటిలోనే రూ.3.80 కోట్ల మేర విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. నగదుతో పాటు సింఘ్వీని కూడా అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.