: ఏపీలో కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్... సంప్రదాయానికి నీళ్లొదులుతున్న వైనం!

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు మృత్యువాత పడితే, అప్పటిదాకా వస్తున్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన కాంగ్రెస్ చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై పోటీకి దిగింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ ఇదే పంథాను అనుసరించి ఘోర పరాజయం పాలైంది. తాజాగా తెలంగాణలోనూ ఏపీ కాంగ్రెస్ అనుసరించిన వ్యూహంతోనే ముందుకెళ్లేందుకు అధికార టీఆర్ఎస్ యత్నిస్తోంది. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ గా వ్యవహరిస్తున్న కిష్టారెడ్డి ఇటీవల కన్నుమూశారు. దీంతో ఖేడ్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. పదవిలో ఉండగా చనిపోయిన నేతల కుటుంబ సభ్యులనే ఆ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయం చాలా కాలం నుంచి ఆనవాయతీగా వస్తోంది. దీనికి స్వస్తి పలికి ఖేడ్ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిని నిలిపేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదేమని అడిగితే, అసలు కిష్టారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సీటిచ్చేందుకు కాంగ్రెస్ లోనే ఏకాభిప్రాయం లేదు, అలాంటప్పుడు ఆ సంప్రదాయం మాకెందుకంటూ టీఆర్ఎస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారట.

More Telugu News