: తెలంగాణ ఉద్యమంలో పాల్గొని... ఎన్ కౌంటర్ లో బలైన ఎంటెక్ విద్యార్థిని
తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఓ విద్యాధికురాలు... చివరకు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో పోలీసుల తూటాలకు నేలకొరిగింది. విధి ఎంత బలీయమైందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే, శృతి అనే అమ్మాయి ఎంటెక్ చదివింది. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత మావోయిస్టుల్లో చేరిపోయింది. నిన్న తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో ఆమె నేలకొరిగింది.
శృతి తండ్రి సుదర్శన్ ఉపాధ్యాయుడు. విరసం సభ్యుడు కూడా అయిన తండ్రి ప్రభావం ఆమెపై పడిందో ఏమో కాని... ఆమె మావోయిజం వైపు మొగ్గుచూపారు. తన కూతురిని ఎన్ కౌంటర్ చేయడంపై ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించారు. ప్రాణాలతో ఉన్న వారిని పట్టుకుని కాల్చి చంపారని మండిపడ్డారు. కోర్టులో ప్రవేశపెట్టి ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలిగేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన తన కూతురు... భూస్వాములు, కార్పొరేట్ శక్తులతో కూడిన తెలంగాణ రావడంతో తీవ్ర అసంతృప్తికి గురైందని చెప్పారు.