: ఇంటర్ విద్యార్థినిని వేధించిన ఇద్దరికి గుండు చేసి, చితక్కొట్టి..!
దేశ రాజధాని ఢిల్లీలో మరో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు, ఆమెను ఓ గదిలో బంధించి అత్యాచారం చేయగా, దీన్ని తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో తీవ్రంగా స్పందించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అమన్ విహార్ ప్రాంతంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి మార్నింగ్ వాక్ కు వెళ్లింది. ఆమెను చూసిన నౌషాద్, మహమ్మద్ అనే ఇద్దరు యువకులు వెంబడించి కిడ్నాప్ చేశారు. వాకింగ్ కు వెళ్లిన అమ్మాయి, ఇంటికి తిరిగి రాకపోవడంతో స్థానికులతో కలసి తల్లిదండ్రులు, బంధువులు వెతుకులాట ప్రారంభించారు.
ఓ ఇంటి ముందు గేటుకు తాళం వేసి వుండటం, లోపల లైట్లు వెలుగుతుండటం చూసి అనుమానం వచ్చి తాళాలు పగులగొడితే, లోపల బాధితురాలి కాళ్లు, చేతులు కట్టేసి పడేసిన స్థితిలో కనిపించింది. ఈ ఇంటిని నౌషాద్ అద్దెకు తీసుకుని ఉండటంతో, అక్కడే కాపుకాసి నౌషాద్, అతని మిత్రుడు మహమ్మద్ రాగానే చితగ్గొట్టారు. గుండుగీశారు. తీవ్ర గాయాలైన వారిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, నిందితులపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.