: ‘గండేపల్లి’లో 16 మృతదేహాల వెలికితీత... నక్కపల్లి పీఎస్ లో లొంగిపోయిన డ్రైవర్

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటిదాకా 16 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. ప్రమాదానికి ముందు ఏలూరు బైపాస్ వద్ద 35 మంది కూలీలు లారీని ఎక్కారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలతో బయటపడ్డ 16 మందిని సహాయక సిబ్బంది రాజమండ్రి, కాకినాడ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే 16 మృతదేహాలే బయటపడటం, మరో 16 మంది ఆసుపత్రులకు వెళ్లడంతో మిగిలిన ముగ్గురు ఏమయ్యారనే ప్రశ్నలు ఉదయయిస్తున్నాయి. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కగా పంట పొలాల్లోకి బోల్తా పడింది. లారీలోని ఫ్లైయాష్ కింద చిక్కుకుని కూలీలు చనిపోయారు. పొలాల్లోని బురద, ఫ్లైయాష్ ల కిందే మిగిలిన ముగ్గురూ చిక్కుకున్నారా? లేక స్వల్ప గాయాలతో బయటపడి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారా? అన్న విషయం తెలియరాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్లైయాష్ ను తొలగిస్తున్న సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘోర ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ జోగి శ్రీను ప్రమాదం జరిగిన వెంటనే క్లీనర్ తో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. నేరుగా విశాఖపట్నం జిల్లా నక్కపల్లి చేరుకున్న అతడు అక్కడి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

More Telugu News