: సూటు, బూటు వేసుకురాలేదని 'నో ఎంట్రీ' చెప్పారు!
సూటు, బూటు వేసుకుని రాలేదని ఓ ముస్లిం మత పెద్దను ముస్లిం క్లబ్ లోపలికి అనుమతించని ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. లక్నోలోని మహ్మద్ బాగ్ క్లబ్ లో ఓ సమావేశం నిర్వహించారు. ఓ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించడంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షుడు మౌలానా సాదిఖ్ ఆ క్లబ్బుకి వెళ్లారు. అయితే ఆయన లోపలికి ప్రవేశిస్తుండగా అక్కడి సిబ్బంది ఆపేశారు. ఎందుకని ఆయన ప్రశ్నించగా, సూటు బూటు వేసుకురాలేదని తెలిపారు. క్లబ్ నిబంధనల ప్రకారం సూటు, బూటు వేసుకోవాల్సిందేనని, లేని పక్షంలో నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. తనకు ఆహ్వానం ఉందని ఆయన చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో ఆయన రాష్ట్ర గవర్నర్ రాంనాయక్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడిన ఆయన 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ క్లబ్ ను ఆదేశించారు.