: నారా లోకేశ్ ను ఏపీ సీఎం చేస్తేనే... లేదంటే 2017లో కుమ్ములాటలే!: జ్యోతిష్యుడి హెచ్చరిక

టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే ఏపీలో టీడీపీ ప్రభుత్వం మనగలుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు రమణరావు జోస్యం చెప్పారు. నిన్న తనతో మాట్లాడిన 'ఆంధ్రజ్యోతి' తెలుగు దినప్రతిక ప్రతినిధికి ఆయన ఈ విషయం చెప్పారు. 2017లో సీఎం అవుతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కారణాలను కనుగొన్న ఆ పత్రిక ప్రతినిధి బెంగళూరులో మకాంపెట్టిన రమణరావుకు ఫోన్ చేశారట. ఈ సందర్భంగా రమణరావు పలు ఆసక్తికర అంశాలను సదరు పత్రిక ప్రతినిధికి చెప్పారు. ‘‘చంద్రబాబు గ్రహస్థితి అంత బాగా లేదు. గ్రహాలు బలహీనంగా ఉన్నాయి. చంద్రబాబే సీఎంగా కొనసాగితే 2017లో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయి. అనూహ్య పరిస్థితులు ఎదురై పరిస్థితి తారుమారు అవుతుంది. అదే సమయంలో లోకేశ్ ను సీఎంని చేస్తే కనుక ప్రభుత్వం కొనసాగుతుంది. లేకపోతే ఇబ్బందికరమే’’ అని రమణరావు జోస్యం చెప్పారు. 2009లో టీఆర్ఎస్ తో సీట్ల సర్దుబాటుపై రమణరావు మాటకు విలువ ఇచ్చిన చంద్రబాబు ఈ సారి ఎలా స్పందిస్తారో చూడాలి.

More Telugu News