: ఐపీఎస్ అధికారిణి చేతులు కట్టేసి దాడి చేసిన దొంగ... సింహపురి ఎక్స్ ప్రెస్ లో ఘటన
రైళ్లలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. నిన్నటికి నిన్న నాందేడ్ ఎక్స్ ప్రెస్ లోకి చొరబడ్డ దోపిడీ దొంగలు పలువురు ప్రయాణికులపై దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మొన్న రాత్రి ఏకంగా ఐపీఎస్ అధికారిపై సింహపురి ఎక్స్ ప్రెస్ లో ఓ దొంగ దాడి చేశాడు. పోలీస్ బాస్ చేతులు వెనక్కు కట్టిపడేసి నగలు, నగదు దోచుకోవడమే కాక ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో ఐపీఎస్ ఆఫీసర్ కు తీవ్రగాయాలు కాగా, తన పని ముగించుకున్న దొంగ నింపాదిగా రైలు దిగి పారిపోయాడు. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏపీ పోలీస్ అకాడెమీ (అప్పా) డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిణి మునిరత్న (నాన్ ఐపీఎస్ కేడర్)కు రక్తం వచ్చేలా గాయాలయ్యాయి.
హైదరాబాదు నుంచి చెన్నై వెళ్లే క్రమంలో సింహపురి ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఆమెపై రైల్లోనే ఓ దుండగుడు దాడికి పాల్పడ్డారు. ఆమె చున్నీతోనే మునిరత్న చేతులు కట్టిపడేసిన దుండగుడు ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులోని నగదును అపహరించాడు. చేతి వేళ్ల మధ్యలో రూపాయి బిళ్ల ఉంచుకుని మునిరత్న ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచే మునిరత్నను గమనిస్తూ వచ్చిన దుండగుడు రైలు నెల్లూరు దాటగానే దాడి చేశాడు. ఇదిలా ఉంటే, ఆమె పెట్టిన కేకలు వినిపించినప్పటికీ రైలు గార్డు ఆమెను రక్షించే యత్నం చేయలేదట. సీటు విషయంలో గొడవ జరుగుతోందని భావించిన గార్డు అటుగా అసలు చూడనే లేదట.