: కాస్సేపట్లో పెళ్లి... ఇంతలో పెళ్లికొడుకు జంప్!
పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయి. ఇక రాత్రికి పెళ్లి జరగాలి. మిత్రులు, బంధువులు, సన్నిహితులు, పరివారమంతా వచ్చారు. పెళ్లి సందడి నెలకొంది. ఇంతలోనే..ఆశ్చర్యకరమైన వార్త!. పెళ్లికొడుకు కనపడట్లేదని! ఇంకేముంది... పెళ్లికూతురు, పెళ్లికొడుకు కుటుంబసభ్యులు గగ్గోలు పెట్టారు. ఈ సంఘటన వివరాలను శుక్రవారం గోల్కొండ పోలీసు ఇన్ స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపారు. హైదరాబాదు సమీపంలోని గోల్కొండ మహ్మదీ లైన్స్ శాతంగనగర్ కు చెందిన రహీం అహ్మద్ ఖాన్ స్టోన్ పాలిష్ పనిచేసే కార్మికుడు.
టోలీచౌకికు చెందిన యువతితో అతనికి వివాహం నిశ్చయమైంది. ఈ నెల 10వ తేదీన వారిద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి జరగాల్సిన రోజు ఉదయం తాను పనిచేసే చోటుకు వెళ్లి వస్తానని చెప్పి రహీం బయటకు వెళ్లాడు. ఆ రోజు మధ్యాహ్నం, సాయంత్రం గడచిపోయినా రహీం ఇంటికి రాలేదు. అతనికి ఫోన్ చేసిన కుటుంబసభ్యులకు నిరాశే ఎదురైంది. రహీం కుటుంబసభ్యులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.