: నవ్యాంధ్రలో తొలిసారిగా ఉద్యోగాల భర్తీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడిన నవ్యాంధ్రలో తొలిసారిగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ప్రభుత్వ పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. పోలీసు శాఖలో 2485 డ్రైవర్‌, కానిస్టేబుల్‌ పోస్టుల నియామకంతో పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 132 న్యూట్రిషన్‌ హెల్త్‌ మొబిలైజర్‌ పోస్టులు, 132 ఎన్‌ఎస్సీ పోస్టులు, 35 ఐసీడీఎస్‌ కోఆర్డినేటర్ ఉద్యోగాలు, 132 ఈసీసీఏ కోఆర్డినేటర్ పోస్టులు, 480 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు విద్యాశాఖలో కొన్ని అత్యవసరంగా భర్తీ చేయాల్సిన పోస్టులకూ నోటిఫికేషన్ రానుంది. రంపచోడవరం డిగ్రీ కళాశాలలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు 41, కృష్ణలంకలో కొత్తగా మంజూరైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు సంబంధించి 17 పోస్టులు, ఎన్‌సీఆర్‌ఎంపీ విభాగంలో 20 పోస్టులు, సాంఘిక సంక్షేమ శాఖలో సబ్‌ ప్లాన్‌ అమలుకు 14 పోస్టులు, టీటీడీలో ప్రత్యేకంగా అదనపు జ్యూయలరీ సెల్‌ కోసం 8 మందిని, విజిలెన్స్‌ కమిషన్‌ లో ఖాళీగా ఉన్న రెండు పోస్టులను భర్తీ చేసేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి అనుమతులు వచ్చాయి. తదుపరి కేబినెట్‌ సమావేశంలో ఈ పోస్టులను ఆమోదించి, ఆపై నియామకాలు చేపడతారని సమాచారం.

More Telugu News