: బీజేపీకి నిరాశ... జేడీఎస్ అండతో బెంగళూరు మేయర్ పదవి కాంగ్రెస్ కైవసం

బెంగళూరు మేయర్ పీఠాన్ని అధిరోహించాలన్న బీజేపీ ఆశలు అడియాశలయ్యాయి. నగర మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీకి చెందిన మడివాళ కౌన్సిలర్ బీఎన్ మంజునాథ్ రెడ్డిని మేయర్ పదవి వరించగా... జేడీఎస్ పార్టీకి చెందిన హేమలత గోపాలయ్య డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటినప్పటికీ, అధికారాన్ని మాత్రం అందుకోలేకపోయింది. పోలింగ్ లో మొత్తం 198 సీట్లకుగాను 100 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 76 సీట్లు, జేడీఎస్ 14, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు. అయితే, సిటీ పరిధిలో ఉన్న 62 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో, బీబీఎంపీ కౌన్సిల్ లో 260 మంది సభ్యులు ఉన్నట్టవుతుంది. ఈ క్రమంలో, కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ మద్దతు పలకడంతో మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మద్దతు పలికినందుకు జేడీఎస్ కు డిప్యూటీ మేయర్ పదవి దక్కింది.

More Telugu News