: గాంధీ గారే చేశారు...మనమెంత?: రాష్ట్రపతి సమక్షంలో అమల అద్భుతమైన ప్రసంగం

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో అమల అక్కినేని అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. స్వచ్ఛభారత్ అంబాసిడర్లను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సత్కరించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రధాని ప్రతిపాదించిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అంబాసిడర్ అమల అక్కినేని అద్భుతమైన ప్రసంగం చేశారు. వివరాలు... మన లేవట్రీని కడుగుకునేందుకు సిగ్గుపడవద్దని చిన్నప్పుడు తన తల్లి సూచించేదని ఆమె గుర్తు చేసుకున్నారు. గాంధీ గారు పని మనుషులను పెట్టుకోకుండా ఆయనే శుభ్రం చేసుకునే వారని, మనం కూడా అలాగే శుభ్రం చేసుకోవాలని చెప్పేవారని ఆమె తెలిపారు. తాను దానినే పాటించానని ఆమె వెల్లడించారు. స్వచ్ఛ భారత్ వల్ల తాను గమనించిందేంటంటే...సమాజంలో రోడ్లు ఊడ్చేవాళ్లు అధమమైనవారనే అభిప్రాయం చాలా మందిలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు రోడ్లను, వీధులను శుభ్రం చేయడం వల్లే మనమంతా ఆరోగ్యంగా ఉన్నామన్న విషయం మర్చిపోయి, వారిని తక్కువ వారిగా చూడడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే వారంతా పేదలు అనే భావం సమాజంలో ఉందని, వారిలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూడలేని వారు ఎక్కువ మంది ఉన్నారని ఆమె అన్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఎవరో సెలబ్రిటీలు చేస్తారు అనే ఆలోచన చాలా మందిలో ఉందని, ప్రజలందర్నీ ఇందులో భాగం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. స్కూలు పిల్లలకు సర్టిఫికేట్లు అందజేస్తే వారు చురుగ్గా పాలుపంచుకునే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. డస్ట్ బిన్ లు ఏర్పాటు చేస్తే అక్కడ కుక్కలు చేరుతాయని అంతా భావిస్తున్నారని, పట్టణాల్లో కుక్కలకు పిల్లలు పుట్టకుండా, రేబిస్ రాకుండా టీకాలు వేయిస్తున్నామని ఆమె తెలిపారు. కుక్కలు పట్టణాల్లో లేకపోతే ఇతర జంతువులు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. అలాగే స్వచ్ఛ భారత్ కోసం ప్రభుత్వాలు నెలలో రెండు రోజులు కేటాయించేలా చూడాలని ఆమె సూచించారు.

More Telugu News