: 1.5 కోట్ల రూపాయల కూలి డబ్బులు మాయం చేసిన పోస్ట్ మాస్టర్!
అవినీతి పరులు నిరుపేదల ఉపాధి హామీ కూలి డబ్బులు కూడా వదలలేదు. 1.5 కోట్ల రూపాయలు బినామీ పేర్లతో స్వాహా చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. గార పట్టణంలోని పోస్టాఫీసుకు ఉపాధి హామీ కూలీ పనుల డబ్బులు తీసుకునేందుకు స్థానికులు వెళ్లారు. అయితే పోస్టాఫీసు సిబ్బంది 'ఇప్పటికే డబ్బులు తీసుకున్నారు కదా?' అని సమాధానం చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఉపాధిహామీ డబ్బులను తాము తీసుకోలేదని, అయినా పోస్టాఫీసు సిబ్బంది తీసుకున్నారంటున్నారని ఆరోపిస్తూ వారు పోస్టల్ సూపరిండెంట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన ఉన్నతాధికారులు, సబ్ పోస్టు మాస్టర్ ను అదుపులోకి తీసుకుని ఉపాధి హామీ రికార్డులు పరిశీలిస్తున్నారు. ఉపాధి హామీకి సంబంధించిన 1.5 కోట్ల రూపాయలు ఏమయ్యాయని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాగా, సబ్ పోస్టు మాస్టరే నిధులు గల్లంతు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.