: నవ్యాంధ్ర ‘నివాసం’లో చంద్రబాబు ఫ్యామిలీ... అమరావతి పూర్తయ్యే దాకా స్థిర నివాసమూ అదేనట!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసం ఇకపై ఆయన కుటుంబానికి స్థిర నివాసంగానూ రూపు సంతరించుకోనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ నగరానికి సమీపంలో కృష్ణా నది ఆవలి ఒడ్డున గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్టలపై నిర్మితమైన ‘లింగమనేని గెస్ట్ హౌస్’ను చంద్రబాబు తన తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల 29న పాలు పొంగించిన చంద్రబాబు సతీమణి సోమవారం నుంచి అక్కడే ఉంటున్నారు.
తాజాగా నిన్న చంద్రబాబు కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలు ఆయన మనవడు సహా అక్కడికి చేరుకున్నారు. ఇకపై చంద్రబాబుతో పాటు వీరంతా కూడా అక్కడే ఉండనున్నారట. అంతేకాక నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయ్యే దాకా చంద్రబాబు కుటుంబానికి ఈ భవనమే స్థిర నివాసంగా మారనుంది. విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసు నుంచి ఈ భవంతి వరకు పక్కాగా రోడ్డును ఏర్పాటు చేసే పనిని అధికారులు చేపడుతున్నారు. అంతేకాక విద్యుద్దీపాల ఏర్పాటు, సమీపంలోని ప్రైవేట్ స్థలంలో హెలిప్యాడ్ తదితరాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.