: కారు మీద మోజుతో సొరంగం తవ్వి స్కూలు నుంచి బయటపడ్డ విద్యార్థులు!

కారుపై మోజుతో చిన్నారులు సొరంగం తవ్విన సంఘటన రష్యాలోని మాగ్నిటోగోర్స్క్ ప్రాంతంలోని ఒక కిండర్ గార్టెన్ లో జరిగింది. ఇక్కడ చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులకు జాగ్వార్ కారు అంటే అమితమైన ఇష్టమట. అది కొనుక్కోవాలనుకున్నారు. కానీ, పాఠశాల నుంచి బయటపడటమనేది పెద్ద సమస్యగా ఉంది. దీంతో వారేమి చేశారంటే.. వారి వద్ద పార, పలుగు, ఆట వస్తువులు ఉన్నాయి. వీటితో పాఠశాల గేటు కింది నుంచి ఆ పార, పలుగు ఉపయోగించి బయట వరకు సొరంగం తవ్వడం ప్రారంభించారు. కొన్నిరోజులకు ఆ సొరంగం పూర్తయింది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఉపాధ్యాయుడి కళ్లు కప్పి పాఠశాల నుంచి బయట పడ్డారు. అక్కడి నుంచి కిలోమీటరుకు పైగా దూరం నడుచుకుంటూ కార్ల షోరూమ్ కు వెళ్లారు. జాగ్వార్ కార్లను తదేకంగా చూస్తూ నిలబడ్డ చిన్నారులను అక్కడున్న మహిళా డ్రైవర్ ఇక్కడేమి చేస్తున్నారని ప్రశ్నించింది. కారు కొనడానికి వచ్చామని, అయితే మా వద్ద డబ్బు లేదని చెప్పిన వారి సమాధానంతో ఆ మహిళకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమె తన కారులో వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసులకు ఒప్పజెప్పింది. పిల్లలను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. కానీ, కిండర్ గార్టెన్ లో విద్యార్థులు ఏమి చేస్తున్నారో పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుల ఉద్యోగాలు మాత్రం ఊడిపోయాయి.

More Telugu News