: శుభవార్త... ఇకపై పీఎఫ్ డబ్బు తీసుకుని ఇల్లు కొనుక్కోవచ్చు!
ఉద్యోగ జీవులకు శుభవార్త. ఇకపై భవిష్యనిధిని తాకట్టు పెట్టడం ద్వారా తక్కువ ధరలో లభించే ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ దిశగా 16వ తేదీన జరిగే ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు గృహాల కొనుగోలుకు పీఎఫ్ నిధులను వాడుకునే సదుపాయం కల్పించడమే ప్రధాన ఎజెండాగా ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో ట్రస్టీలంతా ఓకే మాటతో ఉండటంతో, ఏకగ్రీవంగా నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. పీఎఫ్ నిధుల నుంచి గృహ రుణ నెలసరి కిస్తీలు మినహాయించుకునేందుకు సదుపాయం దగ్గర కానున్నట్టు సమాచారం.
ఈ ప్రతిపాదిత స్కీములో భాగంగా ఉద్యోగి, బ్యాంకు లేదా హౌసింగ్ ఏజన్సీ, ఈపీఎఫ్ఓల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదురుతుంది. బ్యాంకు నుంచి రుణం తీసుకుని కొనుగోలు చేసే ఇంటికి ఈపీఎఫ్ఓ నిధుల నుంచి నెలసరి కిస్తీల చెల్లింపులు జరుగుతాయి. హౌసింగ్ మినిస్ట్రీ, పట్టణ పేదరిక నిర్మూలన పథకాలకు వర్తించే అన్ని ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలూ లభించే విధంగా నిబంధనలను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. కాగా, రేపు జరిగే సీబీటీ సబ్ కమిటీ సమావేశంలో తుది ప్రతిపాదనలు చేసి ట్రస్టీల ముందు పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.