: నా వయసును చెప్పుకునేందుకు గర్వపడుతున్నా: విద్యాబాలన్
సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా హీరోయిన్స్ తమ వయసును బహిరంగంగా చెప్పుకునేందుకు అంతగా సుముఖత వ్యక్తం చేయరన్న సంగతి తెలిసిందే. కానీ విద్యా బాలన్ అందుకు పూర్తిగా వ్యతిరేకం. తనకిప్పుడు 36 సంవత్సరాల వయసని, దీన్ని బయటకు చెప్పుకునేందుకు తానెంతో గర్వపడుతున్నానని అంటోంది. గడచిన దశాబ్దకాలంగా హిందీ చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించిన ఈ భామ, "సంఘంలో యువత పెరిగిపోవడంతోనే, వారిలో ఒకరిగా ఉండాలన్న ఉద్దేశంతో తమ వయసును బయటపెట్టేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. ఇది కేవలం నటీమణులకు సంబంధించింది మాత్రమే కాదు. అందరిదీ. కానీ నేను అలా కాదు. నా వయసు చెప్పుకునేందుకు గర్వపడుతున్నా" అని అంటోంది జాతీయ అవార్డు గెలుచుకున్న విద్యాబాలన్. వయసు కేవలం నంబర్లకు సంబంధించినది మాత్రమేనని, దానికి జీవితంలో ఎంతమాత్రమూ ప్రాముఖ్యత లేదని చెప్పింది.