: ఐఎస్ఐఎస్ తో పెద్ద సమస్యేమీ లేదు: రాజ్ నాథ్ సింగ్

సిరియా కేంద్రంగా వేళ్లూనుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదంతో భారత్ కు వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లినా, దాన్ని తట్టుకునే శక్తి ఇండియాకు ఉందని అన్నారు. తమ గడ్డపై ఉగ్రవాదులకు సహాయపడుతూ, ఇండియాపై దాడులకు ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పైనా రాజ్ నాథ్ విరుచుకు పడ్డారు. దేశ అంతర్గత భద్రత, అభివృద్ధిపై జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. "కొద్ది సంవత్సరాల క్రితం అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు. ఇప్పుడు మరో ఇద్దరు దొరికారు. ఇది పాక్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, ఉగ్రమూలాలు తమ దేశంలో లేవని బుకాయిస్తోంది" అని ఆయన ఆరోపించారు. ఇండియాతో సత్సంబంధాలను ఆ దేశం కోరుకోవట్లేదని, సరిహద్దుల్లో కాల్పుల విరమణకు ఎప్పటికప్పుడు తూట్లు పొడుస్తూనే ఉందని ఆయన అన్నారు. "అమెరికా సైతం పాక్ చర్యలను తప్పుబట్టింది. ఉగ్రవాదులకు సాయపడటాన్ని ఆపివేయాలని కోరింది. ఎన్నడూ పాక్ కు వ్యతిరేకంగా మాట్లాడని యూఏఈ సైతం, పాక్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. ఇండియా ద్వైపాక్షిక విధానం సాధించిన విజయమిది" అని ఆయన తెలియజేశారు.

More Telugu News