: తెలంగాణలో దొరల కుట్ర...ఒకే సామాజిక వర్గంపై దాడులు!: రేవంత్ రెడ్డి
తెలంగాణలో దొరలంతా కలసి కుట్రలు చేస్తూ, ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలపై దాడులు చేస్తున్నారని తెలుగుదేశం నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా పరిషత్ సమావేశాల సందర్భంగా జరిగిన గొడవలు, తెరాస ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చెయ్యి చేసుకున్నారని వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఒకే సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయని కులం పేరు చెప్పకుండానే రెడ్డి వర్గాన్ని ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నాడని, ఆయన్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఐకమత్యంతో కలసి నడవాలని రేవంత్ పిలుపునిచ్చారు.