: భీమవరంలో అభిమానుల గొడవపై స్పందించిన పవన్ కల్యాణ్!

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య జరుగుతున్న గొడవలపై, అమెరికా నుంచి నిన్న హైదరాబాద్ వచ్చిన పవన్ స్పందించారు. భౌతిక దాడులకు తాను వ్యతిరేకినని ఆయన స్పష్టం చేశారు. వర్గ వైషమ్యాలు, కులమత వివాదాలు కూడదని అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. "నా అభిమానుల్లో కక్షసాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడే వైఖరిని వ్యతిరేకిస్తున్నా" అని ఆయన అన్నారు. మొత్తం ఘటనలపై అభిమాన సంఘాల నేతలు ఉండవల్లి రమేశ్ నాయుడు, తూ.గో.జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు తదితరులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా అభిమాన సంఘాలతో శాంతి కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ సూచించినట్టు తెలుస్తోంది. కాగా, కొందరు పవన్ అభిమానులు బహిరంగంగా ప్రభాస్ ప్లెక్సీలను తగలబెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News