: స్మితాకు సాయంపై మరో పిల్... నేడు విచారించనున్న హైకోర్టు సీజే భోసలే
ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కు న్యాయ సహాయం పేరిట తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 లక్షలను నిలిపివేయాలని కోరుతూ మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. నిన్న ఈ వ్యవహారంపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో హైదరాబాదుకు చెందిన సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాదుకే చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తి మరో పిల్ దాఖలు చేశారు.
ఓ హోటల్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన స్మితా సభర్వాల్ పై ‘ఔట్ లుక్’ పత్రిక కథనం రాసిందని, ఆ కథనం తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించిందని భావించిన స్మితా కోర్టెక్కారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా పూర్తిగా స్మితా సభర్వాల్ వ్యక్తిగతమైనదని, దీని కోసం ప్రభుత్వం సాయం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఆ నిధుల విడుదలను నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోసలే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.