: రాజకీయాల్లోకి వస్తున్నా!...వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ షాకిస్తా: సినీ నటి నమిత ప్రకటన
తెలుగు, తమిళ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన నటి నమిత నిన్న ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే ఏడాది తమిళనాట జరిగే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వచ్చేస్తానని ప్రకటించింది. ఇప్పటికే తనకు పలు పార్టీల నుంచి ఆహ్వానం అందిందని చెప్పిన ఆమె, ఆహ్వానం పంపిన వారి పేర్లు మాత్రం ఇప్పుడే వెల్లడించనని తెలిపింది.
‘‘త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా. నాకు ప్రత్యేకతను ప్రసాదించింది తమిళ ప్రేక్షకులు. గుర్తింపునిచ్చిందీ తమిళులే. అందుకే తమిళ ప్రజలకు మంచి చేేసేందుకైనా రాజకీయాల్లోకి వస్తా. నాది గుజరాత్ అయినా, సరికొత్త జన్మనిచ్చింది తమిళనాడు అయినందున నా జీవితం ఈ రాష్ట్రానికే అంకితం. పలు రాజకీయ పార్టీల నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. అయితే ఎవరు పిలిచారన్నది మాత్రం ఇప్పుడు చెప్పను. ఇప్పుడు స్లిమ్ గా తయారై మీకందరికి ఎలా షాకిచ్చానో, వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అందరికీ షాకివ్వబోతున్నాను. బరువు తగ్గడం అసాధ్యమని ఎంతమంది చెప్పినా, దాన్ని ఎలా సుసాధ్యం చేశానో, అలాగే రాజకీయాల్లోనూ అనుకున్నది సాధించి తీరతాను’’ అని ఆమె చెప్పింది.