: రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం... మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లకు 2,631 కోట్లు: కేసీఆర్
తెలంగాణలో రెండు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, 35 లక్షల మంది జనాభాకు ఒక జిల్లా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ వేశామని ఆయన చప్పారు. వారు నివేదిక సమర్పించగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందని ఆయన వివరించారు. అలాగే హైదరాబాదులో ట్రాఫిక్ నియంత్రణ చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా మల్టీలెవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం అంత్యంత ఆవశ్యమని చెప్పారు. ఇందుకు 2,631 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో వ్యవసాయ కళాశాలలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రానున్న మూడేళ్లు ఏడాదికి 25 వేల కోట్ల రూపాయలు చొప్పున నీటి పారుదల శాఖకు కేటాయిస్తామని, తెలంగాణలో కరవన్నది లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.