: గంగూలీ, సచిన్, ద్రవిడ్, ధోనీలకి సాధ్యం కానిది...కోహ్లీకి సాధ్యమైంది!
టీమిండియాను విజయాల బాటపట్టించిన అజహరుద్దీన్ అప్పట్లో కెప్టెన్సీని గంగూలికి అప్పగించాడు. భారత జట్టును విదేశాల్లో ఊరించిన విజయాలను గంగూలి సాధించి శభాష్ అనిపించాడు. దూకుడైన ఆటతీరును జట్టుకు గంగూలీ పరిచయం చేశాడు. టీమిండియాలో రాటుదేలిన చాలా మంది ఆటగాళ్లు గంగూలీని కీర్తించడానికి కారణం అదే అని విమర్శకులు పేర్కొంటారు. అనంతరం సచిన్, ద్రవిడ్, కుంబ్లే తదితరులు కెప్టెన్సీ నిర్వహించినా ధోనీ చేతికి పగ్గాలు అందిన తరువాత టీమిండియా విజయాల్లో కొత్త పుంతలు తొక్కింది. కపిల్ దేవ్ తరువాత వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. టెస్టు, వన్డే, టీట్వింటీ ఛాంపియన్లుగా జట్టును నిలబెట్టడంలో ధోనీ కృతకృత్యుడయ్యాడు. కానీ, శ్రీలంకతో శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలవడంలో మాత్రం విజయం సాధించలేదు.
మొదట్లో టీమిండియా విజయాన్ని రణతుంగ, అరవింద డిసిల్వా అడ్డుకుంటే, ఆ తరువాత జయసూర్య, ఆటపట్టు, దిల్షాన్, సంగక్కర, జయవర్ధనేలు ... చామిందావాస్, మురళీధరన్, మలింగల సహాయంతో టీమిండియా విజయాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. దీంతో సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లున్నప్పటికీ శ్రీలంకలో శ్రీలంకపై విజయం 22 ఏళ్లపాటు అందని ద్రాక్షగా ఊరించింది. ఇప్పుడు రెండు జట్ల నుంచి దిగ్గజ ఆటగాళ్లు క్రికెట్ కు దూరమయ్యారు.
దిగ్గజాలు లేకుండా ఆడగలమని రెండు జట్లు నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా వదులుకోలేదు, చాలా జాగ్రత్తగా ఆడింది. సువర్ణావకాశాన్ని బహుచక్కగా వినియోగించుకుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా డ్రా బారినపడే ప్రమాదం ఉన్నప్పటికీ మొక్కవోని దీక్షతో టీమిండియా విజయం సాధించింది. కాదుకాదు, టీమిండియాను పూజారా, రోహిత్, ఇషాంత్, ఉమేష్ యాదవ్, ఆల్ రౌండ్ షోతో అశ్విన్, మిశ్రా గెలిపించారు. దీంతో గంగూలీ, సచిన్, ద్రవిడ్, ధోనీకి సాధ్యం కానిది కోహ్లీకి సాధ్యమైంది. శ్రీలంకలో శ్రీలంకపై టీమిండియా విజయకేతనం ఏగురవేసింది.