: హార్దిక్ పటేల్ హీరోయిజానికి మహారాష్ట్ర అడ్డం తిరిగింది!

గుజరాత్ లో బలంగా ఉన్న పటేల్ వర్గంలోని హార్దిక్ పటేల్ అనే యువకుడిని అడ్డం పెట్టుకుని చేస్తున్న ఆందోళనలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఆరంభమైంది. రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ సంఘాలన్నిటినీ ఏకతాటిపైకి చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 'రిజర్వేషన్లు తొలగించాలి, లేదా పటేల్ వర్గాన్ని ఓబీసీలో చేర్చాలి' అంటూ హార్దిక్ పటేల్ తలకెత్తుకున్న నినాదంపై నెమ్మదిగా వ్యతిరేకత మొదలైంది. దేశంలో వెనుకబడిన, నిమ్నవర్గాలుగా పేరుపడిన అత్యధికుల ఎదుగుదలను చూడలేక చేస్తున్న ఆందోళనలపై మహారాష్ట్రకు చెందిన ఓబీసీ ఆర్గనైజేషన్ సమర శంఖం పూరించింది. పటేళ్లతోపాటు మరాఠా కమ్యూనిటీకి కూడా రిజర్వేషన్లు ఇవ్వరాదని ఆ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. గుజరాత్ లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని జాట్లు తమను ఓబీసీల్లో చేర్చాలని చేస్తున్న డిమాండ్లను పార్లమెంటులో లేవనెత్తాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుభాష్ బామ్రిని ప్రొఫెసర్ శ్రవణ్ డియోర్ కలిసి వినతి పత్రం సమర్పించారు. మండల్ కమిషన్ పేర్కొన్నట్టు అగ్రవర్ణాలుగా పేరుపడిన వర్గాలు 'బిలో పావర్టీ లైన్' (దారిద్ర్య రేఖకు దిగువ) కిందికి రాలేదని, ఉన్నత వర్గాలుగా భాసిల్లుతున్నాయని, అధికారం, ఆర్థికపరమైన అంశాల్లో ఇంకా వారి పెత్తనం సాగుతోందని ఆయన వినతిపత్రంలో స్పష్టం చేశారు. మరోవైపు హార్దిక్ పటేల్ ఆందోళనలు గుజరాత్ లో ఆందోళనలకు దారితీయగా, ఇతర రాష్ట్రాల్లో కుల సంఘాల నేతలను మేల్కొలిపాయనడంలో సందేహం లేదు.

More Telugu News