: భళా!... లంక టాపార్డర్ ను కుప్పకూల్చిన టీమిండియా పేసర్లు
సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టెస్టులో టీమిండియా పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. పేస్ కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్ పై ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, స్టూవర్ట్ బిన్నీ లంక టాపార్డర్ కు చుక్కలు చూపారు. దాంతో, ఆతిథ్య జట్టు 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇషాంత్ 3, బిన్నీ 2, యాదవ్ ఓ వికెట్ తో సత్తా చాటారు. లంక జట్టులో ఓపెనర్ ఉపుల్ తరంగ (4), సిల్వా (3), కరుణరత్నే (11), కెప్టెన్ మాథ్యూస్ (1), తిరిమన్నే (0) దారుణంగా విఫలమయ్యారు. చాందిమల్ 23 పరుగులు చేశాడు. ప్రసాద్ (1) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక స్కోరు 30 ఓవర్లలో 6 వికెట్లకు 104 పరుగులు కాగా, క్రీజులో పెరీరా (34 బ్యాటింగ్), హెరాత్ (20 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 312 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గా బరిలో దిగిన యువకిశోరం ఛటేశ్వర్ పుజారా 145 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. లోయరార్డర్ లో అమిత్ మిశ్రా 59 పరుగులతో ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో ప్రసాద్ 4, హెరాత్ 3 వికెట్లు తీశారు. ప్రదీప్, మాథ్యూస్, కౌశల్ తలో వికెట్ దక్కించుకున్నారు.