: గతంలోనే ప్రధాని మోదీకి చెప్పా... ఇంకొంత కాలం వేచి చూద్దాం: పవన్ కల్యాణ్
నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా ఆయన రాజధాని భూసేకరణ అంశంపై దృష్టి పెట్టారు. రాజధాని ప్రాంతంలో రైతులతో సమావేశమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా, ఆయన ప్రత్యేక హోదా అంశంపై ట్విట్టర్లో స్పందించారు. విభజన వేళ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి గతంలోనే వివరించానని తెలిపారు. ఆయన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకున్నారని తెలిపారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికే ఆలస్యమైందని, పరిస్థితుల దృష్ట్యా కొంత కాలం వేచి చూద్దామని సూచించారు. దేశ సమగ్రతను పరిగణనలోకి తీసుకొని, భావోద్వేగాలకు పోకుండా సంయమనం పాటిద్దామని అన్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే ప్రత్యేక హోదా ఎలా సాధించాలో ఆలోచిద్దామని పేర్కొన్నారు.