: రూ. 30 కన్నా దిగువకు రానున్న లీటరు పెట్రోల్ ధర: స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా
ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లలో ర్యాలీతో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా పెరిగినా, సమీప భవిష్యత్తులో భారీగా పతనం కానున్నాయని స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా వేస్తోంది. గతంలో 2015 క్రూడాయిల్ ధరలు బ్యారల్ కు 10 డాలర్ల నుంచి 54 డాలర్ల మధ్య కొనసాగుతాయని వెల్లడించిన సంస్థ, నేడు 2016 అంచనాలు విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో క్రూడాయిల్ ధర 20 డాలర్ల వరకూ పడిపోవచ్చని తెలిపింది. ఒకవేళ బేరిష్ మార్కెట్ ముగిసి ధరలు పెరిగితే, గరిష్ఠంగా 63 డాలర్లను దాటే అవకాశాలు లేవని వెల్లడించింది. క్రూడాయిల్ భారత బాస్కెట్ ధర ప్రస్తుతం 46 డాలర్ల వద్ద ఉండగా, హైదరాబాదులో లీటరు పెట్రోలు ధర రూ. 68.45 వద్ద కొనసాగుతోంది.
భవిష్యత్తులో క్రూడాయిల్ ధర స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా వేసినట్టుగా 20 డాలర్లకు పతనమైన పక్షంలో లీటరు పెట్రోలు ధర రూ. 30 కన్నా దిగువకు వస్తుంది. అయితే, ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు పన్నులు పెంచకుండా ఉంటేనే ఆ లబ్ధి ప్రజలకు దగ్గరవుతుంది. ఇదిలావుండగా, శుక్రవారం నాటి సెషన్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే 1.90 డాలర్లు పెరిగి 45.04 డాలర్ల వద్దకు చేరింది. వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ రకం ధర 1.80 డాలర్లు పెరిగి 40.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత బాస్కెట్ ధర రూ. 57 పెరిగి రూ. 2,846 వద్ద ట్రేడయింది.