: 'హీరో'ను కొట్టేందుకు త్యాగాలు చేస్తున్న హోండా!

హీరోతో కలసి సంయుక్తంగా వ్యాపారం చేసినప్పుడు, భారత ద్విచక్ర వాహన రంగంలో మూడు దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యం చూపిన హోండా, అదే స్థాయి అమ్మకాలను సాధించేందుకు త్యాగాలు చేస్తోంది. అవిభాజ్య హీరో హోండా మోటార్స్ (హోండా విడిపోయిన తరువాత హీరో మోటో) నుంచి విడిపోయిన తరువాత హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) పేరిట వ్యాపారాన్ని వేగవంతం చేసిన హోండా ఇప్పుడు రెండవ అతిపెద్ద టూ వీలర్ కంపెనీగా సేవలందిస్తోంది. నిదానంగానే అయినా హీరో మోటో, హోండా మధ్య అమ్మకాల తేడా తగ్గుతూ ఉంది. 2010 ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల యూనిట్లను విక్రయించిన హోండా మోటార్స్, 2015 నాటికి 45 లక్షల యూనిట్లకు అమ్మకాలను పెంచుకుంది. ఇదే సమయంలో మొత్తం టూవీలర్ మార్కెట్లో విక్రయాలు 93.7 లక్షల నుంచి 1.6 కోట్లకు చేరుకున్నాయి. కాగా, ఇండస్ట్రీ వృద్ధితో పోలిస్తే మెరుగైన గణాంకాలను నమోదు చేసిన హోండా, లాభాలను త్యాగం చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని చేరుకోవచ్చని ప్రణాళికలు రూపొందించింది. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లో హీరో మోటో నుంచి కస్టమర్లను హోండా వైపు తిప్పుకోవాలంటే ధరలను తగ్గించాలన్నది సంస్థ ఆలోచనగా తెలుస్తోంది. గడచిన ఐదేళ్లలో సంస్థ నిర్వహణా లాభాలు తగ్గుతూ వస్తుండటాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2010-11లో 12 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్ (ఇతర ఆదాయాలు తీసేసిన తరువాత) 2014-15లో 8.9 శాతానికి తగ్గింది. యూనిట్ల పరంగా విక్రయాలు పెరిగినా 2013తో పోలిస్తే 2014లో సంస్థ ఆదాయం తగ్గింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ బైకులు, అంటే 100 నుంచి 110 సీసీ బైక్ ల విభాగంలో లో మార్జిన్ పోటీ అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సెగ్మెంటులో ఇప్పటికీ హీరోదే పైచేయి అయినప్పటికీ, సమీప భవిష్యత్తులో ఆ సంస్థను కొట్టాలన్నది హోండా అభిమతం.

More Telugu News