: రాహుల్ పగ్గాలు చేపట్టాల్సిన సమయం ఇదే!: సచిన్ పైలట్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. సోనియా ఇక పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఉంటూ పార్టీకి దిశానిర్దేశం చేయాలని ఆయన కోరారు. తదుపరి లోక్ సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతలు రాహుల్ భుజాలపై వేసుకోవాల్సిన సమయం వచ్చిందని సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరలో ఆయన బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. పార్లమెంట్ లోపల, బయట అధికార బీజేపీ విధానాలను రాహుల్ ఎండగడుతున్న తీరు ఆయనపై నమ్మకాన్ని పెంచిందని వివరించారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని సచిన్ తెలియజేశారు. 2019లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాహుల్ వ్యూహాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. "పార్లమెంటులో మెజారిటీ ఉన్నంత మాత్రాన చేతుల్లో బ్లాంక్ చెక్ ఉన్నట్టు కాదు. తమకు తోచినట్టుగా ప్రభుత్వం నడుపుతామంటే చూస్తూ ఎలా కూర్చుంటాం?" అని మోదీ సర్కారును ఉద్దేశించి సచిన్ విమర్శలు గుప్పించారు.

More Telugu News