: మీ వల్లే ఇంత ఘోరం: చైనాపై విరుచుకుపడ్డ వైట్ హౌస్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి చైనాయే కారణమని అమెరికా ఆరోపించింది. కరెన్సీ మార్కెట్లలో పారదర్శకత పాటించకపోవడంతోనే ఇంత ఘోర పతనం నమోదవుతోందని, మార్కెట్ ఆధారిత ఎక్స్ఛేంజ్ రేటును తక్షణం అమలు చేయాలని చైనాను వైట్ హౌస్ కోరింది. వరల్డ్ మార్కెట్లో బ్లాక్ మండే నమోదు కావడానికి చైనా ఆర్థిక వ్యవస్థే కారణమని తెలిపింది. చైనాలో విదేశీ మారక ద్రవ్య విధానం మరింత సరళీకృతం కావాలని, ఈ దిశగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని చైనా అధికారులకూ స్పష్టం చేశామని, వేగంగా పతనమవుతున్న మార్కెట్లు స్థిరత్వం దిశగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు ఆయన వివరించారు. చైనాలో వ్యాపార విధానం పారదర్శకంగా ఉంటే అమెరికన్లు సైతం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. చైనా ప్రభుత్వం స్పందించకుంటే మరో మాంద్యం ముందుకు ప్రపంచ దేశాలు నెట్టివేయబడతాయని ఆయన హెచ్చరించారు. కాగా, మంగళవారం నాడు షాంగై కాంపోజిట్ సూచిక నష్టం 7.5 శాతానికి పెరుగగా, జపాన్ మార్కెట్ 4 శాతానికి పైగా దిగజారింది.

More Telugu News