: బెజవాడకు వస్తున్న రతన్ టాటా... చంద్రబాబుతో భేటీ, గ్రామాల దత్తతపై ప్రకటన
టాటా సన్స్ గ్రూపు 'చైర్మన్ ఎమెరిటస్' రతన్ టాటా నేడు ఏపీకి రానున్నారు. నేటి మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా విజయవాడ రానున్న ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఏపీలోని 200లకు పైగా గ్రామాలను దత్తత తీసుకోవడం, ఏపీలో భవిష్యత్ పెట్టుబడులు వంటి అంశాలపై చంద్రబాబుతో రతన్ టాటా చర్చిస్తారు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. తదనంతరం ఇద్దరు కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు గ్రామాల దత్తతపై విస్పష్ట ప్రకటన చేయనున్న రతన్ టాటా, దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తారు.