: ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం... సీఎం వద్దకు వెళ్లిన పెంపు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణికులపై త్వరలో భారం పడబోతోంది. ఆర్టీసీ చార్జీలు పెంచాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చార్జీల పెంపు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు వద్దకు పంపినట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చార్జీలు స్వల్పంగా పెంచాలని మూడు ప్రతిపాదనలను సీఎం వద్దకు పంపినట్టు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఆర్టీసీలో 85 శాతం నష్టాలు తగ్గాయన్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో రూ.25 కోట్ల నష్టం వాటిల్లిందని సాంబశివరావు వివరించారు.
ఇక డీజిల్ రేటు తగ్గడం వల్ల రూ.65 కోట్లు, అంతర్గత సామర్థ్యం పెంపు వల్ల రూ.70 కోట్ల నష్టం తగ్గినట్టు వెల్లడించారు. ఇటీవల కార్మికులకు ప్రకటించిన ఫిట్ మెంట్ తో నెలకు రూ.55 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ మొదటివారం నుంచి విజయవాడ కేంద్రంగా ఆర్టీసీ కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. డిసెంబర్ 20లోగా పూర్తి స్థాయిలో ఉద్యోగుల తరలింపు జరుగుతుందని అన్నారు.