: హోదా కావాలి, ప్యాకేజీ కావాలి, ఎందుకంటే..: చంద్రబాబు

ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నారు. రేపు ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్న ఆయన, హోదా, ప్యాకేజీ ఎందుకు అవసరమో పేర్కొంటూ సమగ్ర నివేదికను తయారు చేయించారని తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో ప్రత్యేక హోదా రూపంలో రూ.25 వేల కోట్లు, ప్యాకేజీ కింద మరో రూ.1.25 లక్షల కోట్లు... మొత్తం రూ.1.5 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన కోరనున్నట్టు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించిన సమయంలో చట్టంలోని అంశాలు, అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు, విభజన అనంతరం ఏపీలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన హ్యూమన్ డెవలప్మెంట్ సూచికలు తదితరాలను గణిస్తూ ఉన్నతాధికారులు రిపోర్టును తయారు చేశారు. దీన్ని తీసుకునే చంద్రబాబు ఢిల్లీలో ప్రధానిని కలవనున్నారు. కాగా, బీహారుకు రూ. 1.65 లక్షల కోట్ల ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో అంతే స్థాయిలో ఏపీకి కూడా అవకాశాలు దగ్గర చేయాలని చంద్రబాబు కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రం వెనుకబడి వున్న పౌష్టికాహారం, అక్షరాస్యత, పారిశుద్ధ్యం, వయోజన విద్య తదితర రంగాల్లో పుంజుకునేందుకు సాలీనా రూ. 10 వేల కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు రూ. 50 వేల కోట్లివ్వాలని బాబు కోరనున్నారు.

More Telugu News