: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలపై ఈ నెల 21న తెలంగాణ బంద్: కృష్ణయ్య
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని, స్కాలర్ షిప్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర బంద్ చేయనున్నామని బీసీ సంక్షేమ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల గతేడాది ఫీజు బకాయిలు చెల్లించేందుకు రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు చెల్లింపుల్లో ప్రభుత్వ వైఖరి కారణంగా విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహ అలముకున్నాయని ఆయన తెలిపారు. అసలు బీసీ విద్యార్థులు చదవాలో, వద్దో ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
గతేడాది ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్ లు ఐదునెలలు గడుస్తున్నా విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాని కారణంగా కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని, సర్టిఫికేట్ కావాలంటే మొత్తం చెల్లించాలని అడుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను తరగతులకు రానివ్వడం లేదని ఆయన చెప్పారు. అందుకే రాష్ట్ర బంద్ చేపట్టనున్నామని, బంద్ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలు ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు.