: డయానాతో రొమాన్స్ కోసం తీవ్రంగా యత్నించిన అమెరికా వ్యాపార దిగ్గజం
ప్రపంచ అందగత్తెలలో ఒకరిగా పేరుగాంచిన ప్రిన్సెస్ డయానా సౌందర్యానికి ఫ్లాట్ కాని వారు ఎవరూ ఉండకపోవచ్చు. ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఒంటరిగా ఉండేవారు. ఆ సమయంలో ఈ అతిలోక సుందరికి చేరువ కావాలని అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించాడట. ఆమె ఇంటికి ఖరీదైన బహుమతులు, బొకేలు పంపేవాడట. ఆమెను కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడట. ఈ వివరాలను డయానా స్నేహితురాలు, టీవీ ప్రెజెంటర్ సెీనా స్కాట్ తెలిపారు. ఒకానొక సమయంలో డయానా కూడా ఇతని గురించి ఆలోచించిందని ఆమె తెలిపారు.
డయానాను ఓ ఖరీదైన భార్యగా డొనాల్డ్ ట్రంప్ భావించేవాడట. 1997లో రోడ్డు ప్రమాదంలో డయానా మరణించిన అనంతరం 'ది ఆర్ట్ ఆఫ్ కమ్ బ్యాక్' అనే పుస్తకాన్ని ట్రంప్ రచించాడు. ఈ పుస్తకంలో, "అన్నీ ఉన్న తనకు ఏదైనా అసంతృప్తి మిగిలి ఉందంటే అది డయానానే. ఆమెతో డేటింగ్ చేయలేకపోయా. ఆమెతో రొమాన్స్ చేసే అవకాశం వస్తుందని భావించా. కానీ, అలా జరగలేదు. ఆమె ఏ గదిలో ఉన్నా ఆ గదికే అందం వచ్చేది. నిజంగా ఆమె ఓ రాకుమారి" అని రాసుకున్నాడు.