: 'అప్ టూ' వద్దు, 'ఫ్లాట్' డిస్కౌంట్ కావాలంటున్న భారతీయులు!
'అప్ టూ 50%', 'అప్ టూ 60%' అంటూ ప్రకటించే డిస్కౌంట్ల కన్నా 'ఫ్లాట్' డిస్కౌంట్లు ఉంటేనే మంచిదని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ట్రావెల్ బుకింగ్స్ విషయంలో 54 శాతం మంది ఫ్లాట్ డిస్కౌంట్లు కోరుతున్నట్టు ట్రావెల్ సెర్చింజన్ 'స్కై స్కానర్' నిర్వహించిన ఇటీవలి సర్వేలో వెల్లడైంది. ఆన్ లైన్ మాధ్యమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 1000 మందిని సర్వేలో భాగం చేశామని, వారి బుకింగ్ అలవాట్లను అధ్యయనం చేసి ఈ వివరాలు సమీకరించామని సంస్థ వెల్లడించింది. 38 శాతం మంది టికెట్ల రద్దు, ప్రయాణాల వాయిదా విషయాల్లో సరళీకృత విధానాలు కోరుకుంటుంటే, 37 శాతం మంది ప్యాకేజీలు, ఆఫర్లు కోరుతున్నారని స్కై స్కానర్ ఇండియా సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కవితా జ్ఞానమూర్తి తెలిపారు. ట్రావెలర్లు సంప్రదాయ విధానంలో టికెట్ల బుకింగ్ నుంచి సాంకేతికత వైపు వెళుతున్నారని, స్మార్ట్ ఫోన్ల ద్వారా టికెట్ల బుకింగ్ పెరిగిందని ఆమె వివరించారు.