: దండం పెడతా, నన్ను ఒక్కసారి పాక్ పంపండి, నన్ను కాశ్మీర్ పంపిన వాళ్లందర్నీ చంపేయాలి!: ఎన్ఐఏ అధికారులకు నవేద్ వేడుకోలు
ఉధంపూర్ లో భారత్ కు పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్ జీవితంలో ఇంకో కోరిక మిగిలిపోయిందట. పట్టుబడ్డ నాడు 'హిందువులను చంపడం నాకో సరదా' అని వ్యాఖ్యానించిన నవేద్, ఇప్పుడు తనను కాశ్మీర్ కు పంపిన వాళ్లందర్నీ కాల్చి చంపాలని ఉందని విచారణ అధికారులతో అన్నాడట. దయచేసి తనను పాకిస్థాన్ పంపాలని వేడుకుంటున్నాడట. ఈ విషయాలను విచారణ అధికారి ఒకరు తెలిపినట్టు 'హిందుస్థాన్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తనను ఫైసలాబాద్ మసీదులో చూసి, లష్కరే తోయిబాకు పరిచయం చేసిన గురువును తన చేతులతోనే చంపాలని ఉందని నవేద్ అంటున్నట్టు ఆయన అన్నారు.
లష్కరే నేతలు తొలుత వీడియోలు చూపిస్తారని, ఇండియాలో, ముఖ్యంగా కాశ్మీరులో ముస్లింలపై జరిగిన హింసాత్మక ఘటనలు చూపుతారని, ఆపై శారీరక దృఢత్వంపై క్లాసులు నిర్వహించి, రెండో దశలో ఆయుధాలను వాడటం, మూడో దశలో ఆత్మాహుతి దాడులు చేయడంపై శిక్షణ ఇస్తారని నవేద్ తెలిపినట్టు ఆ అధికారి వివరించారు. తొలి దశలో 180 మంది ఉంటే, రెండు, మూడో దశకు 40 మంది మాత్రమే మిగిలేవారని చెప్పాడట.
నవేద్ మానసిక స్థితి ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటోందని చెప్పిన ఆ అధికారి, గూగుల్ మ్యాప్ లో తన నివాసాన్ని, పని చేసిన ఫ్యాక్టరీని నవేద్ గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇండియాకు బయలుదేరే ముందు తనకు రూ. 50 వేలు ఇచ్చారని, దాన్ని కాశ్మీరు లోయలోని అబూ ఖాసిమ్ అట్టి పెట్టుకుని, తనకు రూ. 2 వేలు మాత్రమే ఇచ్చినట్టు తెలిపాడట. నవేద్ విచారణ తరువాత దాదాపు 35 మందికి పైగా భారత వ్యక్తులు లష్కరే తోయిబాకు సహకరిస్తున్నట్టు గుర్తించామని ఆ అధికారి వివరించారు.