: ప్రత్యేక హైకోర్టు ఇప్పట్లో లేనట్టే, చేతులెత్తేసిన కేంద్రం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటు ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ కేసు కోర్టుల పరిధిలోకి వెళ్లినందున తీర్పు వచ్చే వరకూ తామేమీ చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హైకోర్టుల ఏర్పాటు విషయమై తన చేతులు కట్టేసి ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించారు. అయితే, హైకోర్టు విభజనకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ఉమ్మడి హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున తాము మిన్నకుండాల్సి వచ్చిందని వివరించారు. హైకోర్టు విభజన జరిగితే నిధులు, వసతుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. కొత్త హైకోర్టును ఏపీ స్వయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయం విభజన చట్టంలో పొందుపరిచారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయం సైతం పరిశీలనలోనే ఉందని చెప్పారు.